99TV News

    సీఎం రేవంత్‌రెడ్డి - సీఎం ఫడణవీస్‌ భేటీ | Revanth Reddy Meets Devendra Fadnavis

    సీఎం రేవంత్‌రెడ్డి - సీఎం ఫడణవీస్‌ భేటీ | Revanth Reddy Meets Devendra Fadnavis

    హైదరాబాద్/ముంబయి:

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ముంబయి వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ముంబయిలోని సహ్యాద్రి స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఈ భేటీలో అంతర్‌రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

    తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ప్రధాన చర్చ

    ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ (Tummidihatti Barrage) ఎత్తు ఖరారు చేసే అంశం ఈ భేటీలో ప్రధాన అజెండాగా మారింది. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్‌ జాజుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రాజెక్టు డిజైన్, సాంకేతిక అంశాలపై మహారాష్ట్ర సీఎంకు సమగ్ర ప్రజంటేషన్‌ ఇచ్చారు.

    ఎత్తు, ముంపు అంశాలపై వివరణ

    గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన 148 మీటర్ల వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఏ మేరకు ముంపు ఏర్పడుతుంది? ఎంత నీటిని తెలంగాణకు తరలించేందుకు వీలుంటుంది? అనే వివరాలను రేవంత్‌రెడ్డి వివరించనున్నారు. అలాగే, బ్యారేజీని 152 మీటర్ల వద్ద నిర్మిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇరు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలు మరియు ముంపు విస్తీర్ణం ఎంత ఉంటుందనే అంశాలపై ప్రాజెక్టు నివేదికను ఆధారంగా చేసుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి స్పష్టత ఇవ్వనున్నారు. ఈ భేటీతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.